Vladimir Kara Murza: యుద్ధం ఎందుకన్నాడు... 25 ఏళ్ల జైలు శిక్ష పడింది!
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- రష్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్లాదిమిర్ కరముర్జా
- గతేడాది అరెస్ట్
- కరముర్జాపై పలు అభియోగాలు మోపిన రష్యా ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలయ్యాక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ పై దాడులను నిరసిస్తూ రష్యాలో సైతం నిరసనలు చేపట్టారు. మానవ హక్కుల ఉద్యమకారులు సైతం రష్యా చర్యను తప్పుబట్టారు. అయితే, నిరసనకారుల పట్ల రష్యా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. యుద్ధం ఎందుకని ప్రశ్నించిన విపక్ష నేత వ్లాదిమిర్ కరముర్జాకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
కరముర్జాను గతేడాది అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ పై దండయాత్రను బహిరంగంగా విమర్శించడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడం, రష్యా క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తోందంటూ ఆరోపణలు చేయడం వంటి అభియోగాలను కరముర్జాపై మోపారు. అయితే, జైలు శిక్షపై కరముర్జా స్పందిస్తూ... తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని, వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశాడు.
రష్యా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ కరముర్జా చేసిన ఆరోపణలే పాశ్చాత్యదేశాలకు అస్త్రాలయ్యాయి. కరముర్జ వెల్లడించిన విషయాల ఆధారంగానే రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.