IPL 2023: పాండ్యా స్లెడ్జింగ్... కూల్ గా తిప్పికొట్టిన సంజు శాంసన్

Sanju keeps cool after epic staredown with Pandya

  • సంజుపై నెటిజన్ల ప్రశంసల వర్షం
  • ధోనీతో పోలుస్తున్న అభిమానులు
  • ఇరు జట్ల కెప్టెన్ల సరికొత్త రికార్డ్

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన రసవత్తర పోరులో సంజు శాంసన్ జట్టు అద్భుత విజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ సమయంలో సంజు పట్ల స్లెడ్జింగ్ అటెంప్ట్ చేశాడు. దీనిని ఏమాత్రం పట్టించుకోని సంజు తన బ్యాట్ తో గట్టి సమాధానం చెప్పాడు. పాండ్యా స్లెడ్జింగ్ అటెంప్ట్ కు రెచ్చిపోకుండా, తన ఆటతీరుతో కౌంటర్ ఇచ్చాడు. సంజు తీరు అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంది. 

పాండ్యా స్లెడ్జింగ్ వలలో పడకుండా కూల్ గా ఉండడంతో పాటు, దూకుడైన ఆటతో తనదైన శైలిలో సమాధానం చెప్పాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని ప్రశాంతత ధోనీని గుర్తుకు తెస్తుందని చెబుతున్నారు.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 10 ఓవర్లలో చేసిన పరుగులు కేవలం 53. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వి, బట్లర్ వంటి కీలక ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి సమయంలో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను సంజు, హెట్ మయర్ కలిసి నిలబెట్టారు. సంజు 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రషీద్ ఓవర్ లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి దూకుడైన ఆటను కనబరిచాడు. సంజు ఆట పట్ల నెటిజన్లు ముగ్ధులయ్యారు. అతనిని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని కామెంట్స్ పెట్టారు. నేనైతే సంజును భారత టీ20 జట్టు తరఫున ప్రతిరోజు ఆడిస్తానంటూ హర్షా బోగ్లే ఆసక్తికర ట్వీట్ చేశాడు.

మరోవైపు, ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు రికార్డులు సొంతం చేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 115 మ్యాచ్ లు ఆడిన సంజు 3006 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, పదహారు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో అతని అత్యుత్తమ స్కోర్  119. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యా కూడా తన ఖాతాలో ఓ రికార్డ్ వేసుకున్నాడు. ఐపీఎల్ లో 100 మ్యాచులు ఆడిన పాండ్యా 50 వికెట్లు పడగొట్టి, 2000 పరుగులు చేసిన రెండో భారత ఆల్ రౌండర్ గా నిలిచాడు. షేన్ వాట్సన్, ఆండ్రీ రసెల్, జడేజా, పొలార్డ్,  కలిసి మాత్రమే ఈ ఘనత సాధించారు.

  • Loading...

More Telugu News