Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ హన్మకొండ కోర్టులో పిటిషన్
- విచారణకు సహకరించడం లేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ
- తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు
తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని గతంలోను పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్ల పైన కూడా వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేశారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత పదో తరగతి పేపర్లు కూడా బయటకు రావడం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్సీ హిందీ పేపర్ పరీక్ష ప్రారంభమయ్యాక కాసేపటికి కమలాపూర్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మీడియాకు రావడం... అక్కడి నుండి ఓ మాజీ మీడియా ప్రతినిధి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించడం జరిగింది. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్ వాట్సాప్ కు అది వచ్చింది. దీంతో పోలీసులు బండి సంజయ్ సహా పలువురిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. ఈ కేసులో బండి సంజయ్ కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.