balagam: బలగం సినిమా కలుపుతున్న బంధాలు

After watching Balagam movie vanaparthi brother and sister reunited after 15 years

  • వరంగల్ జిల్లాలో కలిసిపోయిన అక్కాతమ్ముడు
  • ఒకే ఊరిలో ఉంటున్నా పదిహేనేళ్లుగా పలకరించుకోని వైనం
  • సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన బలగం సినిమా చూసి అక్కాతమ్ముళ్లలో మార్పు

మానవ సంబంధాలను హృద్యంగా తెరకెక్కించిన బలగం సినిమా నిజజీవితంలో బంధాలను కలుపుతోంది. ఆస్తి కోసమో.. అకారణంగానో విడిపోయిన తోబుట్టువులను ఒక్కటి చేస్తోంది. రాష్ట్రంలో ఊరూరా జరుగుతున్న ఈ సినిమా ప్రదర్శన తర్వాత దూరమైన కుటుంబాలు దగ్గరవుతున్నాయి. ఏళ్ల తరబడి మాట్లాడుకోని బంధువులు తిరిగి కలిసిపోతున్నారు.

నిర్మల్ జిల్లాలో ఆస్తి వివాదాలతో విడిపోయిన అన్నదమ్ములను బలగం సినిమా ఒక్కటి చేసింది. సంగారెడ్డి జిల్లా మాసాన్ పల్లిలో ఎనిమిది నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఒక్కటయ్యాయి. మంచిర్యాలలో 45 ఏళ్ల కిందట విడిపోయిన కుటుంబం ఈ సినిమా చూశాక కలిసిపోయింది. తాజాగా వనపర్తి జిల్లాలో అక్కాతమ్ముడిని కలిపిందీ బలగం సినిమా.

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి, లింగారెడ్డి అక్కా తమ్ముళ్లు.. లక్ష్మిని అదే ఊరిలోని పప్పు వీరారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పదిహేనేళ్ల క్రితం లింగారెడ్డి తన కూతురు రజినికి వివాహం జరిపించాడు. ఈ వేడుకలో తనను ఫొటో తీయలేదని లింగారెడ్డి సోదరి లక్ష్మి అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది.

ఏడాదిన్నర క్రితం వీరారెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లింగారెడ్డి.. తన బావ వీరారెడ్డి అంత్యక్రియలకు వెళ్లలేకపోయాడు. లింగారెడ్డి భార్య వసంత, కొడుకు శ్రీకాంత్ రెడ్డి హాజరైనా ఇరు కుటుంబాలు కలవలేదు.

ఇటీవల వనపర్తి సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ పంచాయతీ కార్యాలయం వద్ద బలగం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. అక్కను కలవాలని భావించిన తమ్ముడు లింగారెడ్డి పంతాలు వదిలేశాడు. సర్పంచ్, గ్రామస్తుల సమక్షంలో అక్క లక్ష్మి ఇంటికి వెళ్లాడు. పదిహేనేళ్ల తర్వాత తన ఇంట్లో అడుగుపెట్టిన తమ్ముడిని చూసి లక్ష్మి.. అక్కను చూసి తమ్ముడు ఇద్దరూ భావోద్వేగంతో కన్నీరు పెట్టారు. వారిని చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News