Maharashtra: ముంబై అవార్డుల వేడుకలో అపశ్రుతి.. వడదెబ్బతో 11 మంది మృతి

11 Die Of Heat Stroke At Maharashtra Bhushan Award Event
  • నవీ ముంబైలో భారీ ఎత్తున నిర్వహించిన సభ
  • కేంద్ర హోంమంత్రి, మహారాష్ట్ర సీఎం హాజరు
  • గ్రౌండ్ లో కుర్చీలే తప్ప ఒక్క టెంటు కూడా వేయని వైనం
  • జనాలను మిట్టమధ్యాహ్నం ఎండలో కూర్చోబెట్టడంతో ఘటన
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన అవార్డుల ఫంక్షన్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఫంక్షన్ కు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ తగలడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు ఆసుపత్రిలో చేరారు. మిట్ట మధ్యాహ్నం ఫంక్షన్ నిర్వహించడం, టెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.

మహారాష్ట్రలో సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు అందజేయడానికి ఆదివారం నవీ ముంబైలోని ఓ గ్రౌండ్ లో అధికారులు వేదికను సిద్ధం చేశారు. భారీ సంఖ్యలో కుర్చీలు వేసినా ఒక్కటంటే ఒక్క టెంట్ కూడా వేయలేదు. ధర్మాధికారి అభిమానులు వేల సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఉదయం 11:30 కు మొదలైన సభ మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభకు హాజరైన జనంలో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే వారిలో 11 మంది చనిపోయారని, మరో 50 మందికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారని పోలీసులు తెలిపారు. ముంబైలో ఆదివారం 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, దీంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారని వివరించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అవార్డుల ఫంక్షన్ కు వచ్చి పదకొండు మంది చనిపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
Maharashtra
award function
heat stroke
11 dead
navi mumbai

More Telugu News