Kamalesh Patidar: అప్పట్లో కరోనాతో చనిపోయాడనుకున్నారు.... రెండేళ్ల తర్వాత ఇంటికొచ్చాడు!
- భారత్ లో కరోనాతో లక్షల సంఖ్యలో మృతులు
- మధ్యప్రదేశ్ కు చెందిన కమలేశ్ పాటిదార్ కు కరోనా
- గుజరాత్ లోని వడోదర ఆసుపత్రిలో చికిత్స
- మరణించాడని చెప్పి పీపీటీ కిట్ లో మృతదేహాన్ని అప్పగించిన డాక్టర్లు
- అలాగే అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
- ఇటీవల స్వగ్రామంలో ప్రత్యక్షమైన కమలేశ్
కరోనా వైరస్ రక్కసి విలయ తాండవం చేయడంతో భారత్ లోనూ లక్షల సంఖ్యలో మృతి చెందారు. అయితే, మధ్యప్రదేశ్ లో విభ్రాంతి కలిగించే సంఘటన చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయాడని భావించిన వ్యక్తి రెండేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.
ధార్ జిల్లా కడోడ్కలన్ గ్రామానికి చెందిన కమలేశ్ పాటిదార్ కరోనా బారినపడడంతో అతడికి గుజరాత్ లోని వడోదర ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, కమలేశ్ మృతి చెందాడని చెప్పిన వైద్యులు, పీపీఈ కిట్ లో ఉంచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో, ఆ మృతదేహానికి కుటుంబ సభ్యులు వడోదరలోనే అంత్యక్రియలు నిర్వహించి మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు.
అయితే, ఇటీవల కమలేశ్ పాటిదార్ కడోడ్కలన్ గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు ఎక్కడున్నావని అతడిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు.
వడోదర ఆసుపత్రిలో పీపీఈ కిట్ లో ఉంచి మృతదేహాన్ని అప్పగించడంతో, ఆ మృతదేహాన్ని తాము పరిశీలించలేకపోయామని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, కమలేశ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడన్న మిస్టరీని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.