Venkatesh Iyer: దెబ్బ తగిలిన తర్వాత రెచ్చిపోయి సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్
- ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు
- 51 బంతుల్లో 104 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్
- 6 ఫోర్లు, 9 సిక్సర్లతో మోత మోగించిన లెఫ్ట్ హ్యాండర్
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వేగంగా సాధించాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కామెరాన్ గ్రీన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి తగలడంతో వెంకటేశ్ అయ్యర్ బాధతో విలవిల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయడంతో మళ్లీ బ్యాటింగ్ కొనసాగించిన ఈ ఎడమచేతివాటం ఆటగాడు తన పవర్ హిట్టింగ్ తో ముంబయి ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బంతి వేస్తే బౌండరీయే అన్నట్టుగా వెంకటేశ్ బ్యాటింగ్ సాగింది. ఈ పొడగరి బ్యాట్స్ మన్ మొత్తం 51 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. అతడి స్కోరులో ఫోర్ల కంటే సిక్సులే ఎక్కువగా ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ మొత్తం 6 ఫోర్లు, 9 సిక్సులు బాది ముంబయి ఇండియన్స్ శిబిరంలో కలకలం రేపాడు.
అయితే, మరో ఎండ్ లో వెంకటేశ్ స్థాయిలో మరెవ్వరూ ధాటిగా ఆడకపోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ స్కోరు 200 దాటలేకపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఈ మ్యాచ్ లో ఒక్క సిక్సు కూడా కొట్టలేకపోయాడు. రింకూ 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కోల్ కతా కెప్టెన్ రితీశ్ రాణా 5 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ 2 ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు ఇచ్చాడు. అయితే వికెట్ మాత్రం తీయలేకపోయాడు. తొలి ఓవర్ ను ఎంతో ప్రభావంతంగా వేసిన అర్జున్... రెండో ఓవర్లో పరుగులు సమర్పించుకున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ పరంగా ఫర్వాలేదనిపించి అర్జున్ టెండూల్కర్ వేగంగా బంతులు విసరలేకపోయాడు. అతడి బౌలింగ్ స్పీడ్ 130 కిమీ లోపే నమోదైంది.
ఇక, లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ కు ఆనందకరమైన విషయం ఏమిటంటే... అస్వస్థతతో ఫీల్డింగ్ కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ... ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు దిగాడు. అయితే ఆడిన తొలి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చినా, బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయాడు.