Arjun Tendulkar: ఎన్నాళ్లకెన్నాళ్లకు... నేడు ఐపీఎల్ లో సచిన్ తనయుడి అరంగేట్రం
- ఐపీఎల్ కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్
- ముంబయి ఇండియన్స్ తుది జట్టుకు ఎంపిక
- గతేడాది రంజీల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ బాదిన అర్జున్
- ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా సచిన్ కుమారుడు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడిగా అర్జున్ టెండూల్కర్ అందరికీ తెలిసినవాడే. కానీ క్రికెట్ మైదానంలో తనను నిరూపించుకోవడానికి, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. గతేడాది గోవా జట్టు తరఫున రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్ ఆడిన తొలిమ్యాచ్ లో సెంచరీ కొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అరంగేట్రం చేస్తున్నాడు.
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ప్రణాళికల్లో చాలాకాలంగా అర్జున్ టెండూల్కర్ భాగంగా ఉన్నాడు. 2021 వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల మినీ వేలంలోనూ అతడిని దక్కించుకుంది. కాగా, ఇవాళ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆడే ముంబయి ఇండియన్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్ కు స్థానం లభించింది. అర్జున్... హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఎంఐ క్యాప్ అందుకున్నాడు.
ప్రధానంగా ఎడమచేతివాటం ఫాస్ట బౌలర్ అయిన అర్జున్... బ్యాటింగ్ లో భారీ షాట్లు కొట్టడంలో దిట్ట. దాంతో, నేటి మ్యాచ్ లో అందరి కళ్లు సచిన్ తనయుడిపైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.
కాగా ఐపీఎల్ లో సచిన్ టెండూల్కర్ తొలి మ్యాచ్ ఆడింది కోల్ కతా నైట్ రైడర్స్ పైనే... ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ పైనే ఐపీఎల్ అరంగేట్రం చేస్తుండడం విశేషం.