credit cards: క్రెడిట్ కార్డుతోనూ యూపీఐ పేమెంట్ చేయొచ్చు.. ఎలాగంటే!
- డిజిటల్ పేమెంట్స్ పెంచేలా కొటక్ మహీంద్ర బ్యాంక్ నిర్ణయం
- కొటక్ క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేసుకునేలా ఏర్పాట్లు
- త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ సదుపాయం తీసుకొస్తాయంటున్న నిపుణులు
కరోనా తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. డిజిటల్ పేమెంట్స్ యాప్ ల మధ్య పోటీ పెరిగింది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా డిజిటల్ వ్యాలెట్లు మార్పులు చేసుకుంటున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత పెంచేందుకు కొత్త సేవలను తాజాగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు డెబిట్ కార్డులను మాత్రమే డిజిటల్ వ్యాలెట్లకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపై క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నట్లు సమాచారం. కొటక్ మహీంద్ర బ్యాంక్ తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది.
క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవల సదుపాయం కల్పించిన తొలి బ్యాంకుగా కొటక్ మహీంద్ర బ్యాంకు నిలిచింది. కొటక్ మహీంద్ర బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న ఖాతాదారులు.. తమ కార్డును భీమ్, పేటీఎం, ఫోన్ పే, ఫ్రీఛార్జ్, పేజాప్ తదితర డిజిటల్ యాప్ లతో లింక్ చేసుకోవచ్చు. ఆపై యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. త్వరలో మిగతా బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలా లింక్ చేసుకోవాలంటే..
యాప్ ఓపెన్ చేసి లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత యాడ్ అకౌంట్ ను ఆపై క్రెడిట్ కార్డు ఆప్షన్ క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డు ఎంచుకున్న తరువాత మొబైల్ నెంబర్, క్రెడిట్ కార్డు వివరాలు నమోదుచేసి రిజిస్టర్ చేసుకోవాలి. అంతే.. ఆపై మీరు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేయొచ్చు.