Polavaram Project: కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది?.. జగన్ పై చంద్రబాబు మండిపాటు
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శలు
- ఎందుకు ఆలస్యం జరుగుతోందో చెప్పాలని నిలదీత
- విధ్వంసకారులకు విధానం ఏముంటుందని వ్యాఖ్య
- ఏపీ ప్రజలు ఆలోచించాలని సూచన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎందుకు ఆలస్యం జరుగుతోందో చెప్పాలంటూ నిలదీశారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పోలవరం నిర్మాణంలో ఏడాదిలో 0.83% పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదికపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
‘‘పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏడాదిలో 0.83% పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదికపై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది? విధ్వంసకారులకు విధానం ఏముంటుంది? ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘థింక్ ఏపీ థింక్’ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు.