IPL: సెంచరీ కొట్టి భారత అభిమానులపై నోరు పారేసుకున్న సన్ రైజర్స్ ఆటగాడు

Harry Brook targets Indian fans for slagging him says glad I could shut them up

  • కోల్ కతాపై 55 బంతుల్లో శతకం సాధించిన హ్యారీ బ్రూక్
  • గత మూడు మ్యాచుల్లో నిరాశ పరచడంతో విమర్శించిన అభిమానులు
  • శతకంతో వారి నోరు మూయించానంటూ వ్యాఖ్య

ఐపీఎల్ 2023కి ముందు జరిగిన వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాళ్లలో హ్యారీ బ్రూక్ ఒకరు. ఈ ఇంగ్లండ్ యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్ ల్లో అతను 13, 3, 13 స్కోర్లతో నిరాశ పరచడంతో అతనిపై  అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రేటుకు ఏమాత్రం న్యాయం చేయలేక పోతున్నాడన్న విమర్శలు వచ్చాయి. కానీ, శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో బ్రూక్ తన మార్కు చూపెట్టాడు. కేవలం 55 బంతుల్లోనే ఈ సీజన్ లో తొలి శతకం సాధించాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గానూ నిలిచాడు. అయితే, మ్యాచ్ అనంతరం అతను భారత అభిమానులపై నోరు పారేసుకున్నాడు.

 ‘మొదటి కొన్ని మ్యాచ్ ల తర్వాత నాపై నేనే కొంచెం ఒత్తిడి తెచ్చుకున్నాను. సోషల్ మీడియాలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నన్నో చెత్త ఆటగాడన్నారు. నా సామర్థ్యాన్ని అనుమానించడం మొదలుపెట్టారు. ఇలాంటి వాటి వల్ల మనపై కొంత అపనమ్మకం కలుగుతుంది. కానీ, ఈ రాత్రి (శుక్రవారం) నేను వాటిని ఏమాత్రం లెక్కచేయకూడదన్న మనస్తత్వంతో బరిలోకి దిగాను. మంచి ఇన్నింగ్స్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది భారతీయ అభిమానులు నేను బాగా ఆడానంటూ పొగుడుతున్నారు. కానీ, వారంతా కొన్ని రోజుల క్రితం నన్ను తిట్టిపోశారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్ తో వారి నోరు మూయించినందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

అయితే, బ్రూక్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఒక్క ఇన్నింగ్స్ తో అతను ఇలా మాట్లాడటం సరికాదంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. బ్రూక్ కు ఏ మాత్రం వినయం లేదని, అతను గొప్ప ఆటగాడు అవలేడంటున్నారు.

  • Loading...

More Telugu News