Covid cases: మే నాటికి భారీగా పెరగనున్న కరోనా కేసులు: ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్

Covid cases expected to touch 50k mark in mid May predicts IIT Kanpur professor

  • రోజువారీ కేసులు 50-60 వేలకు చేరుకోవచ్చని అంచనా
  • 5 శాతం మంది ప్రజల్లో రోగ నిరోధక వ్యవస్థ బలహీనం
  • వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ ను కారణంగా పేర్కొన్న ప్రొఫెసర్

పోయిందనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఉద్ధృత రూపం దాలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు 10 వేలు దాటాయి. కొన్ని నెలల విరామం తర్వాత మరణాలు కూడా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించడం మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా రోజువారీ కేసులు ఈ ఏడాది మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరతాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర్వాల్ అంచనా వేస్తున్నారు.

మే మధ్య నాటికి రోజువారీ కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని, ఆ సమయంలో రోజువారీ కేసుల సంఖ్య 60 వేల వరకు నమోదు కావచ్చని చెప్పారు. కరోనా కేసుల పెరుగుదలకు ఆయన రెండు కారణాలను వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తొలి రెండు విడతల్లో చాలా మందికి సోకడంతో సహజ రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారడం తెలిసిందే. ఇప్పుడు 5 శాతం మంది ప్రజల్లో కరోనాపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గినట్టు డాక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందడాన్ని రెండో కారణంగా పేర్కొన్నారు.

దేశంలో 90 శాతం మందికి, యూపీలో 95 శాతం మందికి సహజ రోగ నిరోధక వ్యవస్థ ఉన్నట్టు అగర్వాల్ తెలిపారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో కరోనా గరిష్ఠ కేసులు 50-60 వేలు అన్నది ఏమంత పెద్దది కాదన్నారు. చాలా కేసుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నట్టు, దగ్గు, జలుబుకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చన్నారు. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ను ఓ సాధారణ ఫ్లూగానే చూడాలన్నారు.

More Telugu News