KGF Babu: కర్ణాటక ఎన్నికల బరిలో కేజీఎఫ్ బాబు భార్య.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
- కేజీఎఫ్ బాబుగా పేరుగాంచిన యూసుఫ్ షరీఫ్
- కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి
- కార్యకర్తలతో విభేదాల నేపథ్యంలో కేజీఎఫ్ బాబును సస్పెండ్ చేసిన పార్టీ
- చిక్కపేట నియోజకవర్గం నుంచి భార్యను బరిలోకి దింపిన కేజీఎఫ్ బాబు
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కర్ణాటక నేత కేజీఎఫ్ బాబు భార్య స్వతంత్ర అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరులో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన కేజీఎఫ్ వాసి అయిన యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు తన ఆస్తుల విలువను రూ. 1,743 కోట్లుగా ప్రకటించుకున్నారు.
ఇప్పుడాయన భార్య షాజియా తరునం బెంగళూరు సెంట్రల్ చిక్కపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. భర్త, కుమార్తెతో కలిసి వచ్చి నామినేషన్ సమర్పించారు. కేజీఎఫ్ బాబు రెండేళ్ల క్రితం బెంగళూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ. 1,743 కోట్లుగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో ఈసారి చిక్కపేట నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, కార్యకర్తలతో విభేదాల కారణంగా పార్టీ ఆయనను పక్కనపెట్టింది. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించి చర్చకు తెరలేపారు.