kodi kathi case: కోడికత్తి కేసులో కుట్ర లేదు.. జగన్ పిటిషన్ కొట్టేయండి.. కోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
- నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలిందన్న ఎన్ఐఏ
- రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు ఘటనతో సంబంధం లేదని వెల్లడి
- కోర్టులో విచారణ ప్రారంభమైనందున.. దర్యాప్తు అవసరం లేదని వివరణ
- విచారణ సోమవారానికి వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కోడికత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణ జరగ్గా.. ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ తెలిపింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు ఘటనతో సంబంధం లేదని పేర్కొంది.
నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలిందని కౌంటర్ పిటిషన్ లో ఎన్ఐఏ చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున.. ఇంకా దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది.
అయితే వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని కోర్టును జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను సోమవారానికి (ఏప్రిల్ 17) వాయిదా వేసింది.