Andhra Pradesh: రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా!.. మార్కాపురం సభలో ముఖ్యమంత్రి జగన్

YS Jagan speech at prakasham district

  • కుటుంబ బాధ్యతలు చిరునవ్వుతో నిర్వహిస్తారని ప్రశంస
  • పేదరికానికి కులం లేదన్న ముఖ్యమంత్రి జగన్
  • అగ్రవర్ణ పేద మహిళలను ఆదుకోవడానికే ఈబీసీ నేస్తం పథకం ఉందన్న సీఎం  
  • మూడేళ్ల పాటు వారికి ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తామని వెల్లడి

కుటుంబ బాధ్యతలను చిరునవ్వుతో నిర్వహించే అక్కాచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నానని, ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని వివరించారు. పేదరికానికి కులంలేదని, అగ్రవర్ణాల్లోని పేద మహిళలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని చెప్పారు. ఇందుకోసమే రాష్ట్రంలో ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద అగ్రవర్ణాల పేద మహిళలకు మూడేళ్ల పాటు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని తెలిపారు. ఈమేరకు బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఈబీసీ నేస్తం నిధులను జగన్ విడుదల చేశారు.

తల్లి కడుపులో ఉన్న శిశువు నుంచి 60 నుంచి వందేళ్ల వరకు ఉన్న అవ్వల దాకా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేసుకుంటూ వచ్చిందని జగన్ చెప్పారు. సంపూర్ణ పోషణ నుంచి పెన్షన్ వరకు మహిళలకు అందజేస్తున్నట్లు సీఎం గుర్తుచేశారు. ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఓసీ పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4,39,068 మంది పేద మహిళలకు రెండో విడతగా రూ.658.60 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్ధతిలో నేరుగా నా అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేస్తామని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే మన ప్రభుత్వం రాష్ట్రంలోని పేదవాళ్ల బ్యాంకు ఖాతాలలో 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా జమచేసిందని జగన్ చెప్పారు. ఇందులో అక్షరాలా 1,42,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్కాచెల్లెమ్మల ఖాతాలకే చేరిందని సీఎం చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ పథకం ద్వారా అక్షరాలా 41,77,000 వేలమంది మహిళలకు ఆర్థిక సాయం అందించినట్లు జగన్ పేర్కొన్నారు. వితంతువులు, దివ్యాంగ మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు తోడ్పడ్డామని ముఖ్యమంత్రి వివరించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
EBC Nestham
  • Loading...

More Telugu News