Telugudesam: ఆ రక్త పిశాచాలు ఇప్పుడు వివేకా వ్యక్తిత్వంపైనా బురద జల్లుతున్నాయి: బీటెక్ రవి
- సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం వల్లే హత్య జరిగిందన్న భాస్కరరెడ్డి తరపు న్యాయవాది
- ఎన్నిసార్లు నాలుక మడతేస్తారన్న బీటెక్ రవి
- గుండెపోటుతో మొదలైన డ్రామా ఇప్పుడు లైంగిక వేధింపుల వరకు వచ్చిందన్న టీడీపీ నేత
సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం వల్లే మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేశారన్న వైఎస్ భాస్కరరెడ్డి తరపు న్యాయవాది వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి (ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి) తీవ్రంగా స్పందించారు. వివేకాను చిత్ర హింసలకు గురిచేసి చంపేసిన రక్త పిశాచాలు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపైనా బురద జల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి గ్యాంగ్ నాలుక మడతేసినట్టు మరెవరూ వేసి ఉండరని, ఒలింపిక్స్‌లో నాలుక మడత పోటీలు పెడితే గోల్డ్ మెడల్స్ అన్నీ జగన్ రెడ్డి ముఠానే సొంతం చేసుకుంటుందన్నారు. గుండెపోటుతో మొదలైన మడత డ్రామా నాలుగేళ్లుగా అనేక అబద్ధాల చుట్టూ తిరుగుతోందన్నారు.
తొలుత గుండెపోటు అన్నారని, ఆ తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారంటూ ‘నారాసుర చరిత్ర’ అనే పుస్తకాలు కూడా రాశారని, ఆ తర్వాత అల్లుడే హత్య చేశాడన్నారని, అక్రమ సంబంధమని, ఆస్తి తగాదాలు కారణమన్నారని, ఇప్పుడు లైంగిక వేధింపులు అంటున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యకేసుపై సీబీఐ దర్యాప్తు అవసరమన్న జగన్‌మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక అవసరం లేదని నాలుక మడతేశారని అన్నారు. వివేకా కుమార్తె పోరాటంతో సీబీఐ దర్యాప్తు జరుగుతుంటే ఆమెపైనా నిందలేస్తున్నారని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.