Tollywood: ‘బాస్ పార్టీ’ బ్యూటీతో అఖిల్ మాస్ పాట

Urvashi Rautela Turns Agent Akhil Item

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ లో నటిస్తున్న అఖిల్
  • ప్రత్యేక పాటలో నర్తించిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా
  • ఈ నెల 28న విడుదల కాబోతున్న చిత్రం

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ... బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్‌ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేక పాటల కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు. పోతినేని రామ్‌ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది. ఇప్పుడు ఆమెను మరో ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’ చిత్రంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి కాలు కదిపింది. ఇది మాస్ ట్యూన్ లో వచ్చే జానపద గేయం అని తెలుస్తోంది. 

ఈ పాటని భారీ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం. కాగా, అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టిన ఈ చిత్రం ఈనెల 28న ‘ఏజెంట్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో  సాక్షి వైద్య  హీరోయిన్ గా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించాడు.

More Telugu News