Amul: కర్ణాటకలోకి అమూల్ రావట్లేదు: అమిత్ మాలవీయ
- కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందన్న బీజేపీ నేత
- కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బలోపేతానికి బీజేపీ కట్టుబడి ఉందని వివరణ
- తమ ప్రభుత్వ హయాంలోనే నందిని గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగిందన్న మాలవీయ
గుజరాత్ కు చెందిన అమూల్ కంపెనీ కర్ణాటకలోకి విస్తరిస్తోందన్న ప్రచారం నిజం కాదని బీజేపీ ఐటీ డిపార్ట్ మెంట్ హెడ్ అమిత్ మాలవీయ స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) బలోపేతం చేయాలన్న తపన ప్రతిపక్ష కాంగ్రెస్ కన్నా తమకే ఎక్కువగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే ‘నందిని’ బ్రాండ్ అంతర్జాతీయంగా ఎదిగిందని మాలవీయ వెల్లడించారు. కేఎంఎఫ్ ఉత్పత్తులలో 15 శాతం విదేశాలలో అమ్ముడవుతున్నాయని వివరించారు.
గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన అమూల్ యాడ్ పై కర్ణాటకలో వివాదం రేగింది. ‘కెంగేరి నుంచి వైట్ ఫీల్డ్ వరకు అందరికీ తాజాదనం’ అంటూ అమూల్ విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే మోదీ కర్ణాటకకు వస్తున్నాడని ట్విట్టర్ లో మండిపడ్డారు. కర్ణాటక పాల కంపెనీ కేఎంఎఫ్ ను గుజరాత్ సంస్థ అమూల్ కు కట్టబెడతారనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై కర్ణాటకలో ఆందోళన వ్యక్తమైంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ట్వీట్ ను విపరీతంగా ట్రెండ్ చేశారు.
సిద్ధరామయ్య ట్వీట్ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ సోమవారం స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఆ పార్టీ చెప్పే అబద్ధాలేనని, అసత్యాలను ప్రచారం చేయడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని ఆరోపించారు. అమూల్, నందిని రెండూ కూడా ఆన్ లైన్ ప్లాట్ ఫాంల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయని వివరించారు. అమూల్ సంస్థ కర్ణాటకలోకి అడుగుపెట్టట్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా నందిని, అమూల్ బ్రాండ్ లు కలిసిపోతాయనే ఆరోపణలు కూడా అర్థరహితమని మాలవీయ తేల్చిచెప్పారు.