Rinku Singh: ఐపీఎల్ చరిత్రలో అద్భుతం... రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్ తో కోల్ కతా విన్
- అహ్మదాబాద్ స్టేడియంలో నరాలు తెగే మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్లకు 204 పరుగులు చేసిన టైటాన్స్
- కోల్ కతా విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం
- వరుసగా 5 సిక్సులు బాదేసిన రింకూ సింగ్
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. ఓ దశలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తో ఓటమి దిశగా సాగుతున్న కోల్ కతా జట్టును రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్ తో గెలిపించాడు.
ఆఖరి ఓవర్లో కోల్ కతా జట్టు గెలవాలంటే 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.... ఆ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన ఉమేశ్ యాదవ్... రింకూ సింగ్ కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. అక్కడ్నించి నమ్మశక్యం కాని రీతిలో రింకూ సింగ్ వరుసగా ఐదు భారీ సిక్సులు కొట్టి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపాడు. అప్పటివరకు విజయం తమదే అని ధీమాగా ఉన్న గుజరాత్ టైటాన్స్ కు రింకూ దెబ్బకు దిమ్మదిరిగిపోయింది.
ఈ ఎడమచేతివాటం ఆటగాడు చిరస్మరణీయంగా నిలిచిపోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ 21 బంతుల్లో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 6 భారీ సిక్సులున్నాయి. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆ చివరి ఓవర్ ను వేసింది యశ్ దయాల్. వరుసగా ఫుల్ టాస్ బంతులు వేయడమే కాదు, లైన్ అండ్ లెంగ్త్ కూడా వేయలేక భారీ మూల్యం చెల్లించుకున్నాడు. బాడీబిల్డర్ లాంటి రింకూ సింగ్ ఆ చెత్త బంతులను అవలీలగా స్టాండ్స్ లోకి కొట్టి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ను తనపేర లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసి విజయభేరి మోగించింది. రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ కూడా మరుగునపడింది.
అసలేం జరిగిందంటే... వెంకటేశ్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ తో గెలుపుదిశగా వెళుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తో కుదుపులకు గురైంది. రషీద్ ఖాన్ వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసి, కోల్ కతాను దెబ్బకొట్టాడు. మొదట ఆండ్రీ రస్సెల్ ను అవుట్ చేసిన రషీద్ ఖాన్... ఆ తర్వాత ప్రమాదకర సునీల్ నరైన్ ను బలిగొన్నాడు. మూడో బంతికి శార్దూల్ ఠాకూర్ ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.
అంతకుముందు ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ ను అల్జారీ జోసెఫ్ అవుట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. వెంకటేశ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 83 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ నితీశ్ రాణా 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేశాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు కోల్ కతా గెలుపుపై ధీమాతో ఉంది.
వీరు అవుటైన తర్వాత ఆండ్రీ రస్సెల్ ఉన్నాడులే అని కోల్ కతా అభిమానుల్లో భరోసా ఉంది. కానీ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తో మ్యాచ్ ను గుజరాత్ వైపు తిప్పేశాడు. అప్పటివరకు గుజరాత్ విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ అందరి అంచనాలను తల్లకిందులు చేసి సిక్సర్ల మోత మోగించి కోల్ కతాను విన్నర్ గా నిలిపాడు.
సొంతగడ్డపై పంజాబ్ తో తలపడుతున్న సన్ రైజర్స్
కాగా, నేడు డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 1.2 ఓవర్లలో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.