Vijay Shankar: విజయ్ శంకర్ మెరుపుదాడి... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

Vijay Shankar fires as Gujarat Titans set KKR 205 runs target
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
  • సారథి హార్దిక్ పాండ్యా లేకుండానే బరిలో దిగిన టైటాన్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసిన వైనం
  • తొలుత సాయి సుదర్శన్ అర్ధసెంచరీ
  • ఆ తర్వాత 24 బంతుల్లోనే 63 పరుగులు చేసిన విజయ్ శంకర్
తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్ తాజా సీజన్ లో బ్యాట్ తో రెచ్చిపోతున్నాడు. ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో విజయ్ శంకర్ సుడిగాలి ఇన్నింగ్స్ తో అలరించాడు. విజయ్ శంకర్ కేవలం 24 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. 

ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ విశ్వరూపం ప్రదర్శించాడు. శార్దూల్ ఠాకూర్ విసిరిన ఆ ఓవర్లో విజయ్ శంకర్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టడం విశేషం. హార్దిక్ పాండ్యా లేకుండానే బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ ఇవాళ్టి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. 

ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 39 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ అర్ధసెంచరీతో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. సాయి సుదర్శన్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత అభినవ్ మనోహర్ (14) స్వల్ప స్కోరుకే అవుటైనా, విజయ్ శంకర్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. విజయ్ శంకర్ కేకేఆర్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, శార్దూల్ ఠాకూర్ లను టార్గెట్ చేసుకుని భారీ షాట్లు కొట్టాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీయగా, సుయాష్ శర్మ 1 వికెట్ తీశాడు.
Vijay Shankar
Gujarat Titans
KKR
IPL

More Telugu News