Narendra Modi: భారత్ లో పులుల సంఖ్య పెరిగింది: ప్రధాని మోదీ
- బందీపూర్ నేషనల్ పార్క్ ను సందర్శించిన మోదీ
- అనంతరం మైసూరులో ఓ కార్యక్రమానికి హాజరు
- పులుల గణాంకాల నివేదిక విడుదల
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ సందర్శన అనంతరం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో పులుల సంఖ్యపై నివేదికను విడుదల చేశారు. దేశంలో పులుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. 2022లో పులుల సంఖ్య 2,967 నుంచి 3,167కి పెరిగిందని వివరించారు.
ప్రకృతి పరిరక్షణ అనేది భారతదేశ సంస్కృతి అని మోదీ పేర్కొన్నారు. అందుకే వన్యప్రాణి సంరక్షణలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనేక ఘనతలను సాధించిందని తెలిపారు. ప్రపంచ భూభాగంలో 2.4 శాతం భూమిని కలిగివున్న భారత్ 8 శాతం జీవ వైవిధ్యానికి వేదికగా నిలుస్తోందని వివరించారు.
ఇవాళ పులులు, ఏనుగులు (30 వేలు), ఆసియాటిక్ ఏనుగులు, సింగిల్ హార్న్ ఖడ్గమృగాలు (3 వేలు), ఆసియాటిక్ సింహాల విస్తృతి పరంగా భారత్ అగ్రస్థానంలో ఉందని మోదీ వెల్లడించారు.
గడచిన నాలుగేళ్లలో దేశంలో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగిందని తెలిపారు. స్వచ్ఛమైన నదులు జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పతాయని, అందుకే దేశంలో నదులను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.