Cardiac cases: హైదరాబాద్ యువతలో పెరిగిన హార్ట్ ఎటాక్ రిస్క్

Cardiac cases among youths more than pre pandemic level

  • 35 ఏళ్లలోపు వారిలో రెట్టింపైన కేసులు
  • కరోనా ముందు నాటితో పోలిస్తే అధికం
  • రక్తంలో హోమో సిస్టీన్ ఎక్కువగా ఉంటే రిస్క్
  • కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా వచ్చిన తర్వాత గుండె పనితీరులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నట్టు ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న ఘటనల ఆధారంగా తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 35 ఏళ్లలోపు యువతలో హార్ట్ ఎటాక్ కేసులు పెరిగినట్టు నగరానికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిశీలించి చూసినప్పుడు వీరంతా గతంలో కరోనా బారిన పడిన వారేనని తెలుస్తోంది. అంతేకాదు, వీరి రక్తంలో హోమోసిస్టీన్ సాధారణ మోతాదుకు మించి ఉంటోంది. 

సాధారణంగా హోమోసిస్టీన్ 50కి మించి ఉంటే అది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉండి, ఇతర రిస్క్ అంశాలు కూడా తోడైతే అటువంటి వారిపై పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు. ప్రతి నెలా ఈ తరహా కేసులు 15 నుంచి 25 వరకు తమ వద్దకు వస్తున్నట్టు కార్డియాలజిస్టులు చెబుతున్నారు. కరోనా మహమ్మారికి ముందు ఇలాంటి కేసుల సంఖ్య సగం కంటే తక్కువే ఉండేవన్నారు. 

నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు 15 ఏళ్ల బాలుడిని తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు అతడికి స్టెంట్ వేయాల్సి వచ్చింది. అతడి కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంది. పైగా కరోనా రెండో వేవ్ లో అతడు వైరస్ బారిన పడినట్టు వైద్యులు తెలుసుకున్నారు. స్నేహితులతో కలసి పుణ్యక్షేత్రాలకు వెళ్లగా ఛాతీలో నొప్పి రావడంతో యాంటాసిడ్ మాత్ర ఇచ్చారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ఈ తరహా కేసుల్లో హోమో సిస్టీన్, లిపోప్రొటీన్ స్థాయులను వైద్యులు ముందుగా పరిశీలిస్తారు. ఇవి అధిక స్థాయుల్లో ఉంటే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టేనని వారు అంటున్నారు. హోమోసిస్టీన్ ఎక్కువ అయితే అది ధమనుల గోడలను దెబ్బతీస్తుందని, అది బ్లడ్ క్లాట్, హార్ట్ ఎటాక్ కు దారితీస్తుందని చెబుతున్నారు. దక్షిణాది వాసుల్లో హోమోసిస్టీన్ స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు ఓ అధ్యయనం ఫలితాలను కూడా ఉదహరిస్తున్నారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రకు తోడు, పొగతాగడం, డ్రగ్స్ సేవనం చిన్న వయసులో గుండె జబ్బులకు కారణమని సూచిస్తున్నారు.

Cardiac cases
heart attack
risen
doubled
pre pandemic
corona
Hyderabad
  • Loading...

More Telugu News