Murali Mohan: మా సినిమా రంగంలో కులం లేదండీ: పోసాని వ్యాఖ్యలపై మురళీమోహన్ స్పందన

Murali Mohan condemns Posani comments

  • నంది అవార్డులపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు
  • అవి కుల ప్రాబల్య అవార్డులంటూ ఆరోపణలు
  • కమ్మ, కాపు అవార్డులని విమర్శలు
  • కులాలు అంటూ ఆర్టిస్టుల మధ్య చిచ్చుపెడుతున్నారని మురళీమోహన్ ఆగ్రహం

సినీ రంగంలో నంది అవార్డుల విషయంలో కొన్ని కులాలదే హవా అని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆరోపించడంపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. సినిమా రంగంలో కులం అనేది లేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఇది నా కులం, అది నీ కులం అని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదని మురళీమోహన్ వెల్లడించారు. 

ఈ కులాల గొడవ ఈ మధ్యన వచ్చిందే తప్ప, సినిమా రంగంలో ఎవరు ఏ కులం అనేది ఎవరికీ తెలిసేది కాదని అభిప్రాయపడ్డారు. అన్నదమ్ముల్లా ఉండే ఆర్టిస్టుల మధ్య అనవసరంగా చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీలో కులం అనేది లేదండీ... పనిలేని వాళ్లు ఇలాంటివి సృష్టిస్తుంటారు అని విమర్శించారు. 

"ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కానీ, నేను ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓ సీల్డ్ కవర్ లో పేర్లు ఉంచి సీఎంకు ఇచ్చేవాళ్లం. వాళ్లు ఓకే చేసి సంతకం పెట్టేవాళ్లు. అంతే తప్ప, ఆయన గానీ, ఈయన గానీ అందులో ఏ పేర్లు ఉన్నాయని ఏనాడూ చూడలేదు. ఎప్పుడూ కులాల ప్రసక్తే రాలేదు... టాలెంట్ ను చూసి అవార్డులు ఇచ్చాం. 

సినిమా అనేదే మాకు కులం. ఇవాళ అందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాల్సింది ఏమిటంటే... అయ్యా, దయచేసి అవార్డులు ఇవ్వండి. ఏడెనిమిదేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదు. వాటిపై నిర్ణయం తీసుకోండి అని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని మురళీమోహన్ వివరించారు.

Murali Mohan
Posani Krishna Murali
Tollywood
  • Loading...

More Telugu News