Chandrababu: "గంజాయి వద్దు బ్రో" ప్రచారాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం: చంద్రబాబు
- రాష్ట్రంలో గంజాయి దందా పెరిగిపోయిందంటున్న టీడీపీ
- గంజాయి వ్యతిరేక ప్రచారం చేపడుతున్న వైనం
- ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు
- డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టే వరకు పోరు ఆగదని వెల్లడి
రాష్ట్రంలో గంజాయి దందా విచ్చలవిడిగా నడుస్తోందని, ఇందులో వైసీపీ వాళ్ల భాగస్వామ్యం ఉందని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. సీఎం జగన్ నివాసం ఉండే తాడేపల్లి, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ గంజాయి లభ్యమవుతోందంటూ టీడీపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ గంజాయి వ్యతిరేక ప్రచారం చేపడుతోంది. దీనిపై చంద్రబాబు స్పందించారు.
ఏపీలో గంజాయి సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైతన్యం తీసుకువచ్చే దిశగా రాష్ట్రంలో గంజాయి వద్దు బ్రో అనే ప్రచారానికి నేడు శ్రీకారం చుడుతున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. యువత భవిష్యత్తును గంజాయి నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.