Andhra Pradesh: ఏపీ సీఎస్‌కు జేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణ నోటీసు
- ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చామన్న జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు
- ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నామని వ్యాఖ్య
- సకాలంలో జీతాలు అందక ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొందని వెల్లడి
- ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
ఏపీ జేఏసీ అమరావతి తన మలిదశ ఉద్యమకార్యాచరణ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్న ఉద్యమ నేతలు ఈ మేరకు లేఖ అందించారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారు. తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నదని చెప్పారు.
సకాలంలో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. టైంకి జీతాలు అందకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనలో కూరుకుపోతాయని తెలిపారు. ఈఎమ్ఐలు చెల్లించని కారణంగా బ్యాంకులు వడ్డీలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక ఉద్యోగులు లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జీతాలు పెరిగితే సంతోషించాల్సిన స్థితి నుంచి జీతాలు అందితే చాలు అన్న స్థితికి ఉద్యోగులను తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.