Varun Chakravarthi: మిస్టరీ స్పిన్నర్లకు తలవంచిన బెంగళూరు టాపార్డర్
- ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా
- బెంగళూరు టార్గెట్ 205 రన్స్
- 54 పరుగులకే 4 వికెట్లు డౌన్
- 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
- కోహ్లీ వికెట్ తీసిన సునీల్ నరైన్
కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 205 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తడబాటుకు గురైంది. ఓ దశలో 4.5 ఓవర్లలోనే 44 పరుగులు చేసిన బెంగళూరు జట్టు మిస్టరీ స్పిన్నర్ల రంగప్రవేశంతో విలవిల్లాడింది.
తొలుత, 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన కోహ్లీ... సునీల్ నరైన్ బంతిని లైన్ అంచనా వేయడంలో పొరబడి బౌల్డ్ అయ్యాడు. అటు, డుప్లెసిస్ ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు. వరుణ్ చక్రవర్తి విసిరిన గూగ్లీని తక్కువ అంచనా వేసిన బెంగళూరు సారథి వికెట్ అప్పగించాల్సి వచ్చింది. దాంతో ఆర్సీబీ 5.2 ఓవర్లలో 46 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే మ్యాక్స్ వెల్ (5), హర్షల్ పటేల్ (0) లను ఒకే ఓవర్లో అవుట్ చేయడం ద్వారా వరుణ్ చక్రవర్తి బెంగళూరును గట్టి దెబ్బతీశాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 8 ఓవర్లలో 4 వికెట్లకు 54 పరుగులు. క్రీజులో మైఖేల్ బ్రేస్వెల్ (5 బ్యాటింగ్), షాబాజ్ అహ్మద్ (0 బ్యాటింగ్) ఉన్నారు.