Narendra Modi: ఆ పని మేం చేయడంతో విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి: మోదీ
- బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహణ
- అవినీతి, వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్న మోదీ
- కార్యకర్తలే బీజేపీకి వెన్నెముక అని వెల్లడి
- హనుమంతుడే తమకు స్ఫూర్తి అని వివరణ
ఇవాళ హనుమాన్ జయంతి. అదే సమయంలో బీజేపీ 44వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తలే బీజేపీకి వెన్నెముక అని కొనియాడారు.
నాడు హనుమంతుడు రాక్షసులపై పోరాడాడని, అదే రీతిలో బీజేపీ అవినీతి, బంధుప్రీతి, నేరాలపై పోరాడుతోందని తెలిపారు. నిస్వార్థ సేవలకు ప్రతిరూపం హనుమంతుడు అని, ఆయనే బీజేపీ శ్రేణులకు స్ఫూర్తి అని మోదీ వివరించారు. కొందరు తమను తాము బాద్షాలు అనుకుంటున్నారని, 2014 నుంచి వారు దేశంలోని పేదలను, బడుగు బలహీన వర్గాలను, అణగారిన వర్గాలను అవమానిస్తూనే ఉన్నారని విమర్శించారు.
ఆర్టికల్ 370 ఒకనాటికి చరిత్రగా మారుతుందని విపక్షాలు ఊహించలేదని, ఆ పని బీజేపీ చేయడంతో విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విపక్షాలు తీవ్ర నిరాశతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ అంటేనే వారసత్వ పరంపర, బంధుప్రీతి, అవినీతి అని అభివర్ణించారు. అందరినీ కలుపుకునిపోవడమే బీజేపీ సంస్కృతి అని స్పష్టం చేశారు.