YS Jagan: దేశ చరిత్రలో కనీవినీ ఎరగని మార్పునకు ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం నాంది: సీఎం జగన్

Family Doctor programme launched by AP CM ys jagan
  • లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ స్కీంను ప్రారంభించిన సీఎం
  • ప్రతీ పేదవాడికీ భరోసా కల్పించే విధానమని వెల్లడి
  • ఇంటి ముంగిటకే వైద్యసేవలు తీసుకొచ్చే కార్యక్రమం
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని మార్పునకు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. గురువారం లింగంగుంట్లలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు ఇంటి ముంగిట్లోనే అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైద్యం అందక ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని ఈ స్కీంని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా మన ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఇకపై ఉండదని వైఎస్ జగన్ చెప్పారు. డాక్టరే మీ గ్రామానికి వచ్చి వైద్యం చేస్తాడని వివరించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇంట్లోనే వైద్యం జరుగుతుందని పేర్కొన్నారు. మందులు కూడా గ్రామానికే వస్తాయని తెలిపారు. ఇంటింటికీ నడిచి వచ్చే పింఛన్ తరహాలోనే వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాలలో మీ ఇంటికే తరలిరావడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన ప్రోగ్రాం ఫ్యామిలీ డాక్టర్ అని జగన్ చెప్పారు.

నిరుపేదలు, పేద సామాజిక వర్గాల వారు ఆసుపత్రుల చుట్టూ, ల్యాబ్ ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ డాక్టర్ పోగ్రాం మీ గ్రామం వద్దకే వీటన్నిటినీ తీసుకొస్తుందని చెప్పారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
YS Jagan
Andhra Pradesh
family doctor
chilakalooripeta
ap cm

More Telugu News