Gurugram: ఆన్ లైన్ లో మూవీ రేటింగ్.. 76 లక్షలు మోసపోయిన మహిళ

Gurugram woman loses Rs 76 lakh in an online movie review scam here is what happened

  • ఫోన్ నుంచే సినిమా చూసి రేటింగ్ ఇవ్వొచ్చంటూ ఆఫర్
  • పార్ట్ టైమ్ జాబ్ పేరిట అమాయకులను ముంచేస్తున్న నేరగాళ్లు
  • రేటింగ్ కు ముందు డిపాజిట్ పేరుతో మోసం

‘అంగుళం కదలక్కర్లేదు. ఫోన్ నుంచే సినిమా చూడండి. రేటింగ్ ఇవ్వండి. ఆదాయం పొందండి’’ ఇదేదో కొత్త ఉపాధి అనుకునేరు. మోసగాళ్లు ఎంపిక చేసుకున్న కొత్త మార్గం. మూవీ రేటింగ్ పేరిట ఇప్పుడు కొత్త స్కామ్ నడుస్తోంది. ఆన్ లైన్ లో సినిమా రివ్యూ పేరిట గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళను రూ.76 లక్షలకు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆన్ లైన్ లో మూవీ టికెట్లు కొనుగోలు చేయండి. బాలీవుడ్, హాలీవుడ్, దక్షిణాది సినిమాలను వీక్షించండి. అదనపు ఆదాయం పొందండి అంటూ గురుగ్రామ్ కే చెందిన ఓ జంట నుంచి మోసగాళ్లు రూ.కోటి రాబట్టిన ఘటన మరువక ముందే.. మరో మహిళను 76 లక్షలకు మోసగించడం అనేది సైబర్ నేరగాళ్లు అమాయకులను ఏ విధంగా లక్ష్యంగా చేసుకుంటున్నదీ తెలుస్తోంది. 

గురుగ్రామ్ లో ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న దివ్య అనే మహిళ పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మోసగాళ్లకు చిక్కింది. మొబైల్ యాప్ లో సినిమాలను చూసి రేటింగ్ ఇస్తే చాలు, మంచి ఆదాయం పొందొచ్చంటూ మోసగాళ్లు ఆమెను ఉచ్చులోకి లాగారు.  ఆమెకు టెలిగ్రామ్ లో మీరా అనే మహిళ నుంచి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. Bitmaxfilm.com అనే పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని, సినిమాలకు రేటింగ్ ఇవ్వడమే పార్ట్ టైమ్ జాబ్ అంటూ తేజస్వి పేరుతో మరో మహిళ వాట్సాప్ లో దివ్యని సంప్రదించింది. 

కనీసం రోజులో ఒక సెట్ మూవీలను చూసి రేటింగ్ ఇవ్వాలని, ఒక సెట్ లో 28 మూవీలు ఉంటాయని దివ్యకు చెప్పారు. ఇందుకోసం ముందుగా రూ.10,500 డిపాజిట్ చేయాలని కోరారు. ఈ మొత్తాన్ని రేటింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవచ్చని నమ్మించారు. అలా రకరకాల మాయ కబుర్లు చెబుతూ ఆమెతో రూ.76.84 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఇదంతా మోసమని అప్పటికి గానీ దివ్య గుర్తించలేకపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించింది.

More Telugu News