dietary supplements: వైద్యుల సూచన లేకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?
- మోతాదు మించితే ఉపయోగాలకు బదులు అనర్థాలు
- వైద్యుల సిఫారసు మేరకు తీసుకోవాలి
- అధికంగా తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు
విటమిన్, మినరల్ సప్లిమెంట్లను రోజువారీ తీసుకునే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. నేడు సమాచార వ్యాప్తి పెరిగిపోయింది. ఇంటర్నెట్ చాలా విషయాలను తెలియజేస్తోంది. దీంతో వైద్యులను సంప్రదించకుండా చాలా మంది న్యూట్రిషన్ సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. కనీసం వైద్యుల సూచన తీసుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
విటమిన్లు, మినరల్స్
విటమిన్ డీ, విటమిన్ బీ12, బిటమిన్ బీ2, బీ 6, ప్రొటీన్ సప్లిమెంట్లు, ఐరన్, క్యాల్షియం, ప్రోబయాటిక్స్, ఫిష్ ఆయిల్ ఉత్పత్తులను చాలా మంది స్వచ్చందంగా తీసుకుంటున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా వీటిని అధిక మోతాదులో వేసుకోవడం వల్ల కడుపులో నొప్పి, కడుపులో తిమ్మిర్లు, మంట, జీర్ణపరమైన సమస్యలు, ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, తల తిరగడం, డయేరియా తదితర సమస్యలు కనిపించొచ్చు.
ఉదాహరణకు పైరిడాక్సిన్ (విటమిన్ బీ6)ను ఒక రోజులో 500ఎంజీ మించి తీసుకుంటే న్యూరోటాక్సిసిటీకి దారితీస్తుంది. విటమిన్ ఈని రోజుకు 800-1200 ఎంజీ మధ్య తీసుకుంటే రక్తస్రావం అవుతుంది. 1200 ఎంజీకి మించి తీసుకుంటే నీళ్ల విరేచనాలు, బలహీనత, కంటి చూపు మసకబారడం కనిపిస్తాయి. ఫిష్ ఆయిల్ లేదా ఒమెగా ఫ్యాటీని రోజులో 2,000 ఎంజీకి మించి తీసుకోకూడదు.
విటమిన్ డీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. విటమిన్ డీ మోతాదు పెరిగితే అది బయటకు వెళ్లదు. శరీరంలోనే ఉండిపోతుంది. అది అధిక క్యాల్షియంను గ్రహిస్తుంది. దీంతో కండరాల నొప్పులు వేధిస్తాయి. కిడ్నీలో రాళ్లు, కడుపులో తీవ్రమైన నొప్పి, హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతాయి.
క్యాల్షియం
క్యాల్షియం ఒక రోజులో 2,500 ఎంజీకి మించి తీసుకుంటే ఆర్టరీలు (ధమనులు) గట్టి పడతాయి. అది ప్రాణాంతకమైనది. ఎముకలకు క్యాల్షియం ఎంతో అవసరం. ఇది లోపిస్తే అవి గుల్లబారిపోతాయి. అదే సమయంలో అధిక మోతాదు తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
ఈ సంకేతాలు
చర్మంపై ర్యాషెస్, దురద, ఎముకల్లో, కండరాల్లో నొప్పులు ఉంటే, తరచూ తలనొప్పి వస్తుంటే, వాంతులు అవుతుంటే, అలసట, పొట్టలో ఇన్ ఫ్లమ్మేషన్, బ్లోటింగ్, డీహైడ్రేషన్ కనిపిస్తే, వైద్యులను సంప్రదించాలి.