Nathu La: సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి సజీవ సమాధి
- ఒక్కసారిగా విరుచుకుపడిన హిమపాతం
- మంచు కింద చిక్కుకుపోయిన పర్యాటకుల వాహనాలు
- 23 మందిని రక్షించిన సైనిక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
సిక్కిం రాష్ట్రంలోని నాథులా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ హిమపాతానికి మంచు చరియల కింద ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పర్యాటకుల వాహనాలు వెళుతుండగా ఒక్కసారిగా హిమపాతం వచ్చింది. టన్నుల కొద్దీ హిమపాతం వారి వాహనాలను కప్పేసింది. 30 మంది మంచు కింద చిక్కుకుపోయారు. సుమారు ఆరు వాహనాల్లో వీరంతా ఉన్నారు.
సైనిక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 23 మందిని రక్షించారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన 13 మంది పర్యాటకులను గ్యాంగ్ టక్ లోని ఎస్టీఎన్ఎం హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత తొమ్మిది మందిని ఇంటికి పంపించారు. గాయపడిన వారందరికీ ఉచితంగా చికిత్స అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రతికూల పరిస్థితులతో నిన్న సహాయక చర్యలను నిలిపివేశారు. తిరిగి ఈ రోజు మళ్లీ ప్రారంభించారు.