Pawan Kalyan: మా అజెండా, బీజేపీ అజెండా ఒకటే: పవన్ కల్యాణ్

Pawan Kalyan talks to media after meeting with JP Nadda
  • జేపీ నడ్డాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని
  • ఏపీలో స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడి
  • వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ అజెండా అని స్పష్టీకరణ
తన ఢిల్లీ పర్యటనలో జేపీ నడ్డాతో సమావేశం అనంతరం, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. 

ఇది చాలా రోజులుగా అనుకుంటున్న సమావేశమేనని వెల్లడించారు. గత రెండ్రోజులుగా పలువురిని కలిశామని తెలిపారు. తాము మొదటి నుంచి ఏపీలో స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నామని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలన్నదే జనసేన అజెండా అని, బీజేపీ అజెండా కూడా అదేనని వివరించారు. 

వైసీపీ నుంచి రాష్ట్రానికి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై లోతుగా, అన్ని కోణాల నుంచి చర్చించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ చర్చలు ఇచ్చే సత్ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం కూడా కీలకమేనని వివరించారు. 

ఇతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు బదులిస్తూ, ఇంకా ఆ స్థాయి వరకు రాలేదని, మొదట మమ్మల్ని మేం బలోపేతం చేసుకోవాల్సి ఉందని, బీజేపీ కూడా బలోపేతం దిశగా ఆలోచించి, సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని, అది ఎలా వెళితే బాగుంటుందన్నది అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నామని తెలిపారు. 

అంతకుముందు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని వెల్లడించారు. రాజకీయ కోణంలోనే కాకుండా, అభివృద్ధి కోణంలోనూ రాష్ట్రం ముందుకు వెళ్లే విధంగా ఉమ్మడిగా ఆలోచించి పరస్పర సహకారం అందించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రతి సమావేశంలోనూ చెప్పారని వివరించారు. ఇది చాలా మంచి పరిణామం అని అన్నారు. 

ఈ రెండ్రోజుల్లో అనేకమంది పెద్దలను కలిశామని, తద్వారా రాష్ట్రానికి మున్ముందు మంచి రోజులు రానున్నాయన్న నమ్మకం బలపడిందని నాదెండ్ల వెల్లడించారు.
Pawan Kalyan
Janasena
Nadendla Manohar
BJP
JP Nadda
New Delhi
Andhra Pradesh

More Telugu News