Saudi Arabia: పవిత్ర రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా.. విరుచుకుపడుతున్న మానవ హక్కుల సంఘాలు
- ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దహనం చేసిన కేసులో దోషికి మరణశిక్ష
- సౌదీలో పెరుగుతున్న మరణశిక్షలపై ఈఎస్‌వోహెచ్ఆర్ ఆందోళన
- 2009 నుంచి రంజాన్ మాసంలో ఇలా ఎప్పుడూ జరగలేదని విమర్శ
- ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మందికి మరణశిక్ష అమలు
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైన ఐదో రోజున అంటే మార్చి 28న ఇస్లాం రెండో పవిత్ర నగరాన్ని కలిగి ఉన్న మదీనా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు ‘సౌదీ ప్రెస్ ఏజెన్సీ’ తెలిపింది.
ఓ వ్యక్తిని కత్తితో పొడిచి ఆపై దహనం చేసిన కేసులో దోషిగా తేలిన సౌదీ వ్యక్తికి ఈ మరణశిక్ష అమలు చేసింది. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ఓ వ్యక్తిని ఉరితీసిందని బెర్లిన్‌కు చెందిన యూరోపియన్ సౌదీ అర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఈఎస్‌వోహెచ్ఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. 2009 నుంచి రంజాన్ మాసంలో సౌదీ ఎప్పుడూ ఇలాంటి పనిచేయలేదని తెలిపింది.
ఇస్లాం జన్మస్థలమైన సౌదీ ఈ ఏడాది ఇప్పటి వరకు 17 మందికి మరణశిక్ష అమలు చేసినట్టు ఈఎస్‌వోహెచ్ఆర్ తెలిపింది. సౌదీ గతేడాది ఏకంగా 147 మందిని ఉరి తీసింది. అంతకుముందు ఏడాది 69 మందికి మరణశిక్ష అమలు చేసింది. 2015లో కింగ్ సల్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1000 మందికిపైగా మరణశిక్షకు గురైనట్టు పేర్కొంది.