- తమిళనాడులోని ఓ గ్రామంలో మంత్రి సీతారామన్ పర్యటన
- చుట్టూ చేరి గ్యాస్ ధరలు తగ్గించాలని కోరిన గ్రామ మహిళలు
- అంతర్జాతీయ మార్కెట్లోని ధరలే నిర్ణయిస్తాయని తేల్చి చెప్పిన సీతారామన్
సామాన్యులకు వంటింటి గ్యాస్ భారంగా మారిపోయింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కోసం వారు ఇప్పుడు రూ.1,155 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కొలువు దీరడానికి ముందు, 2014 మార్చిలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.410. భవిష్యత్తులో మరో రూ.70 పెరిగితే మొత్తమ్మీద బీజేపీ పాలనలో రెండింతలు పెరిగినట్టు అవుతుంది.
నాడు రూ.410 ధరపై సబ్సిడీ పోను ఇంకా తక్కువే పడేది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ రూ.40కి పరిమితమైంది. దీంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందస్తు ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ గ్రామాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. గ్రామస్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మంత్రి సీతారామన్ చుట్టూ చేరి గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెటే నిర్ణయిస్తుందని చెప్పారు.
‘‘మన దేశంలో వంట గ్యాస్ లేదు. దీన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. కనుక అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిపోతే ఇక్కడ కూడా రేట్లు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి. కానీ, గత రెండేళ్లలో పెద్దగా తగ్గింది లేదు’’అని మంత్రి స్పష్టం చేశారు. ఒక విధంగా గ్యాస్ ధరల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని మంత్రి చెప్పారు.