ipl: సీఎస్కే, ముంబై తర్వాత ఆర్సీబీదే ఆ ఘనత: కోహ్లీ

RCB have qualified most number of times after MI and CSK admits Kohli

  • 2023లో శుభారంభం చేసిన ఆర్సీబీ
  • ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం
  • అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించిన కోహ్లీ, డుప్లెసిస్

ఐపీఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సొంతగడ్డపై ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ ఫా డుప్లెసిస్ తో కలిసి అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 89 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లీ ఐపీఎల్‌లో మూడో అత్యంత విజయవంతమైన జట్టు తమదే అన్నాడు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ట్రోఫీ గెలుచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిళ్లు నెగ్గింది. ఆర్సీబీ ఇప్పటికీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అయితే అత్యధికంగా ప్లేఆఫ్స్‌ ఆడిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. 

సీఎస్కే 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరుకోగా, ముంబై తొమ్మిది సార్లు ప్లేఆఫ్స్ ఆడింది. ఇదే విషయాన్ని కోహ్లీ గుర్తు చేశాడు. ముంబైపై ఆర్సీబీ భారీ విజయం గురించి మాట్లాడాడు. ‘మేం ఒక సమయంలో ఒకే మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. జట్టు సమతూకంలో ఉండేలా చూసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ రాత్రి (ఆదివారం) మాదిరిగానే ఇకపైనా మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని అనుకుంటున్నాం’ అని వివరించాడు. 

తొలి పోరులో 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేసిన విరాట్ ఐపీఎల్ లో మరో మైలురాయిని చేరుకున్నాడు. మెగా లీగ్ లో 800 బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) క్లబ్ లో చేరాడు. గత సీజన్ వరకు 796 బౌండరీలు సాధించిన విరాట్ తాజా  మ్యాచ్ లో  800 బౌండరీల క్లబ్ లో చేరాడు. శిఖర్ ధవన్ (843), డేవిడ్ వార్నర్ (800) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. అలాగే, ఐపీఎల్‌లో 50 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. వార్నర్ 55 అర్ధ సెంచరీలతో ముందున్నాడు.

More Telugu News