half day schools in AP: ఏపీలో ఎల్లుండి నుంచి ఒంటి పూట బడులు.. పదో తరగతి పరీక్షలు కూడా అదే రోజు నుంచే!
- ఎండలు పెరగడంతో హాఫ్ డే స్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించామన్న మంత్రి బొత్స
- ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయని వెల్లడి
- టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వ్యాఖ్య
ఎండలు మండిపోతుండటంతో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయని తెలిపింది. ఎండలు ఎక్కువ కావడంతో సోమవారం నుంచి హాఫ్ డే స్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఒంటి పూట బడులు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని, ఎండల తీవ్రత లేదన్న కారణంతోనే ఇప్పటివరకు పూర్తి క్లాసులు నిర్వహించినట్లు చెప్పారు. వాతావరణ శాఖ నివేదికలు ప్రతి వారం తెప్పించుకుంటున్నామని వివరించారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం అవుతాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.