Palle Raghunath Reddy: పుట్టపర్తిలో రణరంగం.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

high tension in puttaparthi sri sathya sai district

  • శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • సత్యమ్మ గుడి దగ్గర రెండు వర్గాల గొడవ
  • రాళ్లు, చెప్పులతో పరస్పర దాడులు
  • పల్లె రఘునాథరెడ్డి కారు ధ్వంసం
  • తోపులాటలో సొమ్మసిల్లి పడిపోపోయిన మాజీ మంత్రి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది. 

యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్.. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో లోకేశ్ ను, పల్లె రఘనాథరెడ్డిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో శ్రీధర్ రెడ్డి పోస్టులు పెట్టారు. దీంతో పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి సవాల్ విసిరారు. 

ఈ నేపథ్యంలో సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు పల్లె రఘునాథ్‌రెడ్డి సిద్ధమయ్యారు. పుట్టపర్తి టీడీపీ ఆఫీసుకు ఆయన రాగా.. పోలీసులు అక్కడే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అయితే పల్లె రఘునాథ్ టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు. ఇద్దరు నేతలూ సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. సత్యమ్మ గుడి దగ్గరికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. తోపులాటలో రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రఘునాథ రెడ్డిని అరెస్టు చేశారు.

దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుట్టపర్తిలో భారీగా మోహరించిన పోలీసులు.. పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని తెలిపారు.

తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్న పల్లె రఘునాథరెడ్డి.. అక్కడ ప్రమాణం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ రెడ్డిపై పాదయాత్రలో లోకేశ్ చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తెలిపారు. ఎమ్మెల్యే వస్తే ఆధారాలతో నిరూపిస్తామని మరోసారి సవాల్ విసిరారు.

Palle Raghunath Reddy
Sridhar Reddy
Puttaparthi
YSRCP
Yuva Galam Padayatra
Nara Lokesh
TDP
  • Loading...

More Telugu News