Samantha: కాళిదాసు వర్ణించిన శకుంతల వంటి అమ్మాయి ఈ భూమి మీదైతే ఉండదు: గుణశేఖర్
- దృశ్య కావ్యంగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం'
- కాళిదాసు కావ్యంలోని శకుంతల దొరకడం కష్టమని వెల్లడి
- సమంతను తీసుకోవడానికి అదే కారణమని వ్యాఖ్య
- ఈ నెల 14న విడుదలవుతున్న సినిమా
గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం పాత్రలకి తగిన నటీనటులను ఎంపిక చేసుకోవడం అనుకున్నంత తేలిక కాదు" అన్నారు.
"కాళిదాస మహాకవి రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' నేను చదివాను. అందులో ఆయన శకుంతలను వర్ణించిన తీరును చదివిన తరువాత నేను లోచనలో పడ్డాను. ఎందుకంటే ఆయన వర్ణించిన లాంటి అమ్మాయి ఈ భూమ్మీదైతే ఉండదు. అందువల్లనే ఎవరైతే ఆ పాత్రకి బాగుంటారా అని చాలా రోజుల పాటు ఆలోచించాను" అని చెప్పారు.
"అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక కథను ఈ జనరేషన్ కి సమంత ద్వారా చెప్పిస్తే బాగుంటుందనే విషయాన్ని మా అమ్మాయి చెప్పింది. అందువలన సమంతను తీసుకోవడం జరిగింది. ఇక దుష్యంతుడి పాత్రలో ఉండే కొన్ని షేడ్స్ వలన తెలుగు హీరోలు ఒప్పుకోకపోవచ్చని అనిపించింది. హీరో ఇమేజ్ ఆ పాత్రను ప్రభావితం చేయకూడదని కూడా అనిపించింది. అందువల్లనే కొత్త ఫేస్ అయితే బాగుంటుందని భావించి, దేవ్ మోహన్ ను తీసుకోవడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.