Imran Khan: ఐపీఎల్ ఆడకుండా పాక్ క్రికెటర్లపై బీసీసీఐ బ్యాన్ విధించడంపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు
- పాక్ క్రికెటర్లు బాధ పడాల్సిన అవసరం లేదన్న ఇమ్రాన్
- బీసీసీఐ అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శ
- క్రికెట్ ను శాసించే స్థాయికి బీసీసీఐ చేరుకుందని వ్యాఖ్య
ఐపీఎల్ లో ఆడేందుకు ఇండియా అనుమతించకపోవడం పట్ల పాకిస్థాన్ క్రికెటర్లు బాధ పడాల్సిన అవసరం లేదని పాక్ మాజీ ప్రధాని, ఆ దేశానికి ప్రపంచకప్ ను అందించిన క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ ప్లేయర్లను ఐపీఎల్ లో అనుమతించకపోవడం తనకు వింతగా అనిపిస్తుందని చెప్పారు. అంతులేని సంపదతో బీసీసీఐ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐపీఎల్ లో పాక్ ప్లేయర్లు ఆడకుండా భారత్ నియంత్రించడం వల్ల ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
పాకిస్థాన్, భారత్ ల మధ్య సంబంధాలు దిగజారడం దురదృష్టకరమని ఇమ్రాన్ అన్నారు. క్రికెట్ ప్రపంచంలో సూపర్ పవర్ గా ఉన్న భారత్ అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పారు. అంతులేని సంపదను సృష్టించే శక్తి బీసీసీఐకు ఉందని... దీంతో, అహంకారంతో యావత్ క్రికెట్ నే శాసించే స్థాయికి భారత్ చేరుకుందని తెలిపారు. ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదు అనేది కూడా ఇండియా నిర్ణయిస్తోందని విమర్శించారు.
2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో పాకిస్థాన్ క్రికెటర్లు ఆడారు. అదే ఏడాది చివర్లో ముంబైలో టెర్రరిస్టుల దాడులు జరిగాయి. దీంతో, భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి దిగజారాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఐపీఎల్ పాక్ క్రికెటర్లు ఆడకుండా బీసీసీఐ బ్యాన్ విధించింది.