IPL-2023: తారల తళుకుబెళుకులతో ఘనంగా ప్రారంభమైన ఐపీఎల్-16

IPL 16th season kick starts in Ahmedabad

  • భారత్ లో నేటి నుంచి ఐపీఎల్-2023
  • అహ్మదాబాద్ నరేంద్ మోదీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
  • అరిజిత్ సింగ్ గాన మాధుర్యం, తమన్నా, రష్మిక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్
  • తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 16వ సీజన్ కు తెరలేచింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 

ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ పఠాన్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాల్లోని గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా, అందాల రష్మిక మందన్న తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. పలు హిందీ గీతాలతో పాటు ఊ అంటావా పాటకు తమన్నా ఉత్సాహంగా స్టెప్పులేయగా... ఆ తర్వాత రష్మిక పుష్ప హిట్ సాంగ్స్ తో స్టేడియంలో జోష్ పుట్టించింది. చివర్లో ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటతో అదరగొట్టింది.

అనంతరం, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో తలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలను ప్రత్యేక శకటాలపై స్టేడియం మధ్యలోని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే వేదికపై ఉన్న ఐపీఎల్ పాలకమండలి చీఫ్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా.... ఇరు జట్ల కెప్టెన్లకు స్వాగతం పలికారు.

More Telugu News