Bopparaju Venkateswarlu: ఉద్యోగుల పెన్షన్ పై వ్యాఖ్యలు చేసిన జయప్రకాశ్ నారాయణకు బొప్పరాజు కౌంటర్

Boppraju counters Jayaprakash Narayan comments on pension

  • జేపీ వ్యాఖ్యల పట్ల ఉద్యోగ సంఘాల ఆగ్రహం
  • జేపీ పెన్షన్ తీసుకోవడం లేదా అని ప్రశ్నించిన బొప్పరాజు
  • జేపీపై ఎవరో ఒత్తిడి తీసుకువచ్చి ఈ వ్యాఖ్యలు చేయించారని వెల్లడి 

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేపడుతున్న ఉద్యమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం కూడా పాల్గొంటుందని బొప్పరాజు వెల్లడించారు. పాఠశాలలకు నాడు-నేడు నిధులు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన ఉందని తెలిపారు. మాల్ ప్రాక్టీసు నెపంతో ఇబ్బంది పెట్టే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇక, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల బొప్పరాజు స్పందించారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే రూ.50 వేల పింఛను తీసుకుంటున్నారని, ప్రజాప్రతినిధులు పింఛను ఎందుకు తీసుకుంటున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. మాజీ ప్రజాప్రతినిధులు మూడు పింఛనులు తీసుకోవచ్చా? పింఛను త్యాగం చేయాలని ప్రజాప్రతినిధులకు జేపీ చెప్పాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమ దోపిడీ గురించి జేపీ మాట్లాడాలని అన్నారు. 

పాత పెన్షన్ విధానంపై జేపీకి అంత బాధ ఎందుకని బొప్పరాజు సూటిగా ప్రశ్నించారు. ఓపీఎస్ ఇస్తే ప్రభుత్వాలు పడిపోతాయని అనడం సరికాదని... ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు ఒకటేనని జేపీ గుర్తించాలని హితవు పలికారు. సమకాలీన సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న జేపీ పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

ఐఏఎస్ అధికారిగా పనిచేసిన జేపీ పెన్షన్ తీసుకోవడంలేదా? అని నిలదీశారు. జేపీపై ఎవరో ఒత్తిడి తీసుకువచ్చి ఈ వ్యాఖ్యలు చేయించినట్టుగా ఉందని అన్నారు. జేపీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News