Amaravati: ఇచ్చేది చాక్లెట్... ఎత్తుకెళ్లేది నక్లెస్.. జగన్ సంక్షేమమంతా బూటకం: కన్నా లక్ష్మీనారాయణ

TDP Leader kanna laxminarayana fires on Jagan

  • జగన్ వి ఉత్తర కుమార ప్రగల్భాలన్న కన్నా లక్ష్మీనారాయణ
  • రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారని మండిపాటు
  • దేశంలోనే అత్యంత ధనికుడు కావాలని జగన్ అనుకుంటున్నారని ఆరోపణ

ఏపీలో ఒక్క అధికార పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటున్నాయని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్.. రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారు. జగన్‌కు మూడు రాజధానులు కట్టాలని లేదు. కేవలం దేశంలోనే అత్యంత ధనికుడైన నాయకుడు కావాలని అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇసుక పాలసీ, రాజధాని అంశం’’ అని చెప్పుకొచ్చారు.

రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1,200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ.. మందడంలో రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. విశాఖ వడ్డించిన విస్తరిలా ఉందని, దోచుకోవడానికే రాజధాని అంటున్నారని ఆరోపించారు.

జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని కన్నా మండిపడ్డారు. ఇచ్చేది చాక్లెట్... ఎత్తుకెళ్లేది నక్లెస్ అని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు నాలుగేళ్లలో అసంతృప్తితో ఇళ్లకు పరిమితమయ్యారని, పోలీసులు మాత్రం వాళ్ల కంటే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. జగన్‌‌ను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు ముందుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తంచేశారు.

More Telugu News