World Idli Day: ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదేనా?
- తేలిగ్గా అరిగే అల్పాహారం
- ప్రొటీన్, ఫైబర్ తో ఆరోగ్యానికి మంచిది
- ఇందులోని అమైనో యాసిడ్స్ తోనూ ఆరోగ్య ప్రయోజనాలు
- పాలిష్డ్ బియ్యం, పొట్టు తీసిన మినప పప్పు వద్దు
ఇడ్లీ మనందరికీ తెలిసిన అల్పాహారం. రుచికరమైన చట్నీ ఉంటే.. లెక్క పెట్టుకోకుండా ఇడ్లీలను లాగించేసేవారు ఎంతో మంది ఉన్నారు. సాధారణ ఇడ్లీ కంటే, ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ తో తినేందుకు ఎక్కువ మంది ఇష్టం చూపిస్తారు. నేడు ప్రపంచ ఇడ్లీ దినం. కనుక ఇడ్లీతో ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి.
ఇడ్లీలో కేలరీలు తక్కువే. ప్రొటీన్, ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఫైబర్ ఉండడంతో జీర్ణం సులభంగా అవుతుంది. మినప్పప్పుతో చేయడం వల్ల ఐరన్ కూడా దండిగా లభిస్తుంది. మొదటి రకం ప్రొటీన్ జంతువుల నుంచి లభిస్తుంది. కావాల్సిన అమైనో యాసిడ్స్ సులభంగా అందుతాయి. మొక్కల ఆధారిత ప్రొటీన్ రెండో రకం అవుతుంది. ఇందులో అమైనో యాసిడ్స్ తక్కువ. ధాన్యాలు, పప్పుల్లో విడిగా అమైనో యాసిడ్స్ ఉండవు. అలా కాకుండా బియ్యం, మినప్పప్పుని ఇడ్లీగా చేసుకోవడం వల్ల అన్ని అమైనో యాసిడ్స్ అందుతాయి. అప్పుడు మొదటి రకం ప్రొటీన్ మాదిరే పనితీరు ఉంటుంది.
ఇడ్లీ పిండిని రుబ్బిన వెంటనే ఇడ్లీగా వేసుకోరు. అలా వేసుకున్నా రాదు. కొన్ని గంటల పాటు రుబ్బిన ఇడ్లీ పిండిని అలా ఉంచేయాలి. అప్పుడు ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఇడ్లీ మంచిగా రావడానికి, రుచిగా ఉండడానికి ఈ ప్రక్రియ సాయపడుతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాకపోతే పాలిష్ పట్టని బియ్యం. పొట్టుతీయని మినప్పప్పును వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇక ఇడ్లీ తయారీకి నూనె అవసరం లేదు. ఈ రకంగానూ ప్రయోజనమే.