Raghu Rama Krishna Raju: అన్నింటికీ వైఎస్సార్ పేరేనా... ఆయనను ప్రేమించేవాళ్లను కూడా దూరం చేస్తున్నారు: రఘురామకృష్ణరాజు

Raghurama comments on naming YSR

  • ఏపీలో ప్రతిదానికి వైఎస్సార్ పేరు పెడుతున్నారన్న రఘురామ
  • ఏపీ వన్ యాప్ కు కూడా వైఎస్సార్ పేరు పెట్టారని విమర్శ 
  • రాష్ట్రానికి కూడా వైఎస్సార్ పేరు పెట్టేస్తారేమోనని వ్యంగ్యం 

ఏపీలోని ప్రతి దానికి వైఎస్సార్ పేరు తగిలిస్తున్నారని, చూస్తుంటే రాష్ట్రానికి కూడా వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేస్తారేమోనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. పారిశ్రామిక అనుమతుల కోసం ఏపీ వన్ అనే యాప్ తీసుకువచ్చారని, దానికి కూడా వైఎస్సార్ ఏపీ వన్ అంటూ పేరుపెట్టారని ఆరోపించారు. 

"అడిగేవాళ్లు లేరు కదా అని రాష్ట్రానికి కూడా నీ తండ్రి పేరు పెట్టేస్తావా? రాష్ట్రం నీ అబ్బ సొత్తా? మొన్న ఒక దిక్కుమాలిన సదస్సు చేశారు.... అవి వచ్చేది లేదు చచ్చేది లేదు. పరిశ్రమల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వైఎస్సార్ ఏపీ వన్నా...? పార్కులకు వైఎస్సార్... కూరగాయల మార్కెట్లకు వైఎస్సార్... ప్రధానమంత్రి కాళ్లా వేళ్లా పడి రేపు రాష్ట్రానికి కూడా పేరు మార్చేయండి. 

గతంలో వైఎస్సార్ కడప జిల్లా అన్నారు... ఆ తర్వాత కడప ఎత్తేసి వైఎస్సార్ జిల్లా అంటున్నారు. రాష్ట్రానికి కూడా అలాగే వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి, ఓ రెండు నెలలు అయ్యాక ఆంధ్ర కట్ చేసి వైఎస్సార్ ప్రదేశ్ అని పిలవండి. 

వైఎస్సార్ ప్రదేశ్ కు వచ్చి, వైఎస్సార్ క్యాంటీన్ లో తిని, వైఎస్సార్ పార్కులో రెస్ట్ తీసుకుని, వైఎస్సార్ బస్టాండులో బస్సెక్కి ... ఇలా అన్నింటికీ పేర్లు మార్చేలా ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేశ్ అన్నట్టు... ఆడ్ని ఎవరికైనా చూపించండ్రా బాబూ! ఈ నామకరణ ఉన్మాదానికి, ఈ రంగుల ఉన్మాదానికి చిరాకెత్తిపోతోంది. ఎక్కడికి వెళ్లినా వైట్ అంట్ బ్లూ రంగులు, వైఎస్సార్ పేర్లు...! 

ప్రజల హృదయాల్లో ఉండేలా చూడాలి కానీ, భవనాలకు రంగులు వేసి, గోడలపై పేర్లు రాసి ఆ తండ్రికి ఉన్న ఇమేజ్ ను చెడగొడుతున్నారు. ఆయనను ప్రేమించేవాళ్లను కూడా ద్వేషించేలా చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం" అని రఘురామ పేర్కొన్నారు.

Raghu Rama Krishna Raju
YSR
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News