Khushbu sundar: మోదీపై వివాదాస్పద ట్వీట్.. వివరణ ఇచ్చుకున్న ఖుష్బూ
- 2018లో మోదీని విమర్శిస్తూ ఖుష్బూ ట్వీట్
- ఖుష్బూ ట్వీట్‌తో బీజేపీని బోనులో నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
- కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ
- అది ముగిసిపోయిన అధ్యాయమని కామెంట్
‘‘మోదీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్‌పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత ఖుష్బూ 2018లో మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పోలి ఉన్న ఆ ట్వీట్‌తో బీజేపీని బోనులో నిలబెట్టేందకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం సంచలనంగా మారడంతో ఖుష్బూ తాజాగా స్పందించారు. అది ముగిసిపోయిన ఉదంతమని, చచ్చిన పామును మళ్లీ చంపేందుకు కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో అది నాకున్న అభిప్రాయం. చాలాకాలం కిందటే నా అవగాహన మెరుగుపడి మోదీ విషయంలో అభిప్రాయం మారిపోయింది. ఆ తరువాత నా ఆలోచనా ధోరణి మార్చుకుని బీజేపీలో చేరా. కాబట్టి.. నాటి విషయమై క్షమాపణ చెప్పేందుకు నేనేమాత్రం సంకోచించను. అయినా.. అది ముగిసిన అధ్యాయం. కాబట్టి.. చచ్చిన పామును చంపేందుకు ప్రయత్నిస్తున్నందుకు వాళ్లమానాన వాళ్లని వదిలేయడమే’’ అని కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్ ట్విట్టర్‌లో చేసిన ఓ వ్యాఖ్యకు స్పందనగా ఖుష్బూ ఈ మేరకు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.