Dr Anitha: రాజస్థాన్ లో ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా మహిళా డాక్టర్ వినూత్న నిరసన
- రాజస్థాన్ లో రైట్ టు హెల్త్ బిల్లు
- ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బు చెల్లించకుండానే అత్యవసర చికిత్స
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు
- ఆసుపత్రి మూసేసి పానీ పూరీ అమ్ముతున్న డాక్టర్ అనిత
రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుపై వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లు పేరు రైట్ టు హెల్త్ బిల్లు. రాజస్థాన్ లో ఏ పౌరుడైనా ఏ ఆసుపత్రిలోనైనా ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఎమర్జెన్సీ చికిత్స పొందవచ్చు. దీనిపై రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసనల బాటపట్టారు.
అనిత అనే మహిళా డాక్టర్ అయితే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీకర్ పట్టణంలోని తన ఆసుపత్రిని మూసేసిన ఆమె ఓ పానీ పూరి బండి పెట్టారు. ఆసుపత్రి బోర్డు తొలగించి, అనిత పుచ్కావాలీ అని పానీ పూరీ అమ్మకాల బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాదు, తన నేమ్ ప్లేట్ లోనూ మాజీ ప్రైవేటు వైద్యురాలు అని మార్చేశారు. కాగా, మరో డాక్టర్ ఆసుపత్రికి తాళాలు వేసి పరోటాలు అమ్ముతున్నారని అనిత చెప్పారు.