Ramcharan: తండ్రిలా సాయం చేసేవాడు .. బాబాయ్ లా అన్నం పెట్టేవాడు చరణ్: హైపర్ ఆది!
- చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టేజ్ పై హైపర్ ఆది
- పదిమంది దణ్ణం పెడితే అది మెగాస్టార్ అని వ్యాఖ్య
- పదిమందికి అన్నం పెడితే అది పవర్ స్టార్ అని వెల్లడి
- ఆ రెండు లక్షణాలు ఉన్నవాడు మెగా పవర్ స్టార్ అంటూ కితాబు
మెగా అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేదికపై చరణ్ గురించి హైపర్ ఆది మాడ్లాడుతూ, అందరిలో మరింత జోష్ ను పెంచాడు. ఆయన మాట్లాడుతూ .. "ఒక మనిషిని చూడగానే పదిమంది దణ్ణం పెడితే అది మెగాస్టార్. ఒక మనిషి పదుమందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. చరణ్ కి తన తండ్రిలా సాయం చేయడం తెలుసు. తన బాబాయ్ లా అన్నం పెట్టడం తెలుసు" అని అన్నాడు.
'ఆచార్య' కాస్త అటు ఇటు అయితే చిరంజీవి పనైపోయిందని రాశారు. అలాంటివాళ్లకి 'వాల్తేరు వీరయ్య' వసూళ్లతో ఆయన సమాధానం చెప్పారు. ఇక పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన సాగించిన పోరాటాలెన్నో .. ఆయన సాధించిన విజయాలెన్నో. ఆయన జనాభా లెక్కల్లో ఒకడు కాదు .. లెక్క లేనంత జనాభాకి ఒకే ఒక్కడు. సమస్య తలుపు తడితే పరిష్కారాన్ని ఇంట్లో ఉంచే నాయకుడు ఆయన" అని చెప్పాడు.
"చరణ్ విషయానికొస్తే .. తండ్రి పేరు నిలబెడతాడా? బాబాయ్ పేరు కాపాడతాడా? అని అంతా అనుకుంటూ ఉంటే, తాను కేవలం కుటుంబానికి మాత్రమే కాదు .. దేశం మొత్తానికి పేరు తీసుకుని వచ్చినవాడాయన. తెలుగు సినిమాకి ఆంధ్రాలో ఎంత వచ్చింది .. తెలంగాణలో ఎంత వచ్చింది అని మాట్లాడుకునే స్థాయిని, అమెరికాలో ఎంత వసూలు చేసిందని మాట్లాడుకునేలా చేసినవాడు మెగా పవర్ స్టార్" అంటూ చెప్పుకొచ్చాడు.