school students: లక్నోలో ఒక్కో విద్యార్థికి రూ.25వేల ఉచిత వైద్య బీమా
- లక్నో స్మార్ట్ సిటీ యాజమాన్యం నిర్ణయం
- ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ప్రాజెక్ట్
- అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చెకప్
- ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున హెల్త్ కార్డ్
పాఠశాలల్లో డ్రాపవుట్స్ పెద్ద సమస్య. విద్యార్థులు చదువుకునే స్థోమత లేక మానేస్తుంటారు. అందుకే దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇక విద్యార్థులకు వైద్య పరమైన సమస్యలు ఎదురైతే..? సర్కారు దవాఖానాకు బదులు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యానికి వీలుగా ఉచిత బీమా సదుపాయం ఉంటే..? అది విద్యార్థుల భద్రతకు భరోసానిస్తుంది. అందుకే లక్నో మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు.
లక్నో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా గుర్తించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను, అనారోగ్యాలను అరికట్టవచ్చని తెలిసిందే. లక్నోలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని కళాశాలలు, స్కూళ్లలో చదివే 2,000 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయనున్నారు. వారికి రూ.25వేల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కూడా ఇవ్వనున్నారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేయాలని లక్నో స్మార్ట్ సిటీ పాలకవర్గం నిర్ణయించింది. ఇందుకు రూ.25 లక్షల బడ్జెట్ ను కూడా కేటాయించింది.