Leopard: తిరుమల మొదటి కనుమ దారిలో చిరుత కలకలం
- 35వ మలుపు వద్ద కనిపించిన చిరుతపులి
- హడలిపోయిన వాహనదారులు
- టీటీడీకి సమాచారం అందించిన వాహనదారులు
- చిరుతను అడవిలోకి మళ్లించేందుకు సిబ్బంది ప్రయత్నం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. మొదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద చిరుతపులి కనిపించడంతో తిరుపతికి వెళుతున్న వాహనదారులు హడలిపోయారు. కొందరు వాహనదారులు చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీకి సమాచారం అందించారు. దాంతో టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిరుమల శేషాచల అడవుల్లో పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభ సమయంలో లాక్ డౌన్ విధించగా, జనసంచారం లేని తిరుమల కొండపై చిరుతలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు యధేచ్ఛగా విహరించాయి. లాక్ డౌన్ సమయంలోనే ట్రాఫిక్ సిబ్బంది తిరుమల కొండపైకి వెళుతుండగా, ఘాట్ రోడ్డులో ఓ చిరుత దాడి చేసింది. అయితే ట్రాఫిక్ సిబ్బంది చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.