Chiranjeevi: అప్రయత్నంగానే కంట తడి.. ‘రంగమార్తాండ’పై మెగాస్టార్ ప్రశంసలు

mega star chiranjeevi appreciates rangamarthanda team

  • ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన భావోద్వేగానికి గురిచేసిందన్న చిరంజీవి
  • ప్రతి ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టు అనిపిస్తుందని వ్యాఖ్య
  • ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలని పిలుపు

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలని కోరారు. చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ఈరోజు ట్వీట్ చేశారు. 

‘‘రంగమార్తాండ చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఈచిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్.. ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు.. హాస్యబ్రహ్మానందం కలయిక.. వారి పనితనం.. ఆ ఇద్దరి అద్భుతమైన నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది’’ అని పేర్కొన్నారు. 

‘‘బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి పెట్టించింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’కు రీమేక్ గా రంగమార్తాండను కృష్ణవంశీ రూపొందించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News